Thursday, June 4, 2009

పేరులో ఏముంది?

నమస్కారం! నా అసలు పేరు వర్మ. ఏదో రాసేద్దాం, పొడిచేద్దాం అనుకుంటూ నాకు నేను పెట్టుకున్న కలంపేరు డి.వి.యస్.అబ్బులు.. పుట్టిపెరిగింది పశ్చిమగోదావరి జిల్లాలో. అందుకేనేమో ఆ గోదారితల్లిని చూసినా, తలుచుకున్నా ఏదో తెలియని మధురానుభూతితో మనసు పులకరించిపోతుంది! . అమెరికాలోని శతకోటి తెలుగు ఇంజనీర్లలో ఒక బోడి సాఫ్టువేరు ఇంజనీరుగాడి అవతారం ఎత్తి, గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే మకాం! ఎప్పుడూ ఏదీ రాయని నాకు, ఎందుకో రాయాలని (దుర్)బుద్ధి పుట్టుకొచ్చింది. దారీతెన్నూ లేకుండా మనస్సుకి ఏదితోస్తే అది వా(బ్లా)గుతాను. మీరే భరించాలి.

ఇంతకీ నా పెట్టుడు (కలం) పేరులో డి.వి.యస్. అంటే ఏమిటో తెలుసాండీ? మీరు చిన్నప్పుడు చేసిన అల్లరిలో అదీ ఒక భాగం! అదేనండి, మనందరం క్లాసులో ఎవడో ఒక అమాయకుణ్ణి పట్టుకుని, వాడిచేత ఒక వాక్యం రాయించి, అదే వాక్యాన్ని వాడితోటే వెనక్కి చదివించి ఏడిపించేవాళ్ళం కదుటండీ? అబ్బ...మీరు మరీ అలా మర్చిపోతే ఎలాగండీ? చెప్పెయ్యమంటారా? సరే....

డిగాడు వా సిరా!

ఈరోజుకి సెలవా మరి?

భవదీయుడు,
అబ్బులు